Paidi Rakesh Reddy : జీవన్ రెడ్డి అక్రమాలను బయటపెడుతున్నందుకే బెదిరింపు కాల్స్
X
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయేలోగా వాళ్లందరినీ చంపుతానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను చంపుతామంటూ కొందరు వ్యక్తులు పదే పదే కాల్స్ చేస్తున్నారని, అలాంటి పరిస్థితే వస్తే మగధీర సినిమాలో రామ్ చరణ్ లా వాళ్లందరినీ చంపి చస్తానంటూ ఎమ్మెల్యే షాకింగ్స్ కామెంట్స్ చేశారు. అక్రమ మైన్, మాల్ అంశాల జోలికి పోవద్దని కాల్స్ చేస్తూ తనను బెదిరిస్తున్నారని అన్నారు. 'నీ అంతు చూస్తాం.. నిన్ను చంపేస్తాం' అంటూ కొందరు వ్యక్తులు విదేశాల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని అన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను బయటకు తీసేందుకు తాను ప్రయత్నిస్తున్నందునే ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాకేశ్ రెడ్డి తెలిపారు.
బెదిరింపులకు తాను భయపడే వ్యక్తినికాదని, తనను చంపడం ఎవరి తరం కాదని ఎమ్మెల్యే అన్నారు. బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. గత పదేళ్లలో ఆర్మూర్ లో జరిగిన అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ క్రమంలోనే తాను సీబీఐ డెరెక్టర్ కలిశానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ పంపాలని ఆయన సూచించారని, ఈ విషయంలో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రాకేశ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓడించిన విషయం తెలిసిందే.