Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్..!
X
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో అధికారం తమదేనన్న కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో ఓటమిపై ఆ పార్టీ అంతర్మథనం మొదలుపెట్టింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న కమలదళం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. బండి సంజయ్ను అధ్యక్ష పీఠం నుంచి తప్పించడమే బీజేపీకి సీట్లు తక్కువ రావడానికి కారణమని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యక్ష బాధ్యతలు బండి సంజయ్కే అప్పగించాలని ఆ పార్టీ ప్రణాళికలు వేస్తోంది.
లోక్ సభ ఎన్నికలు బీజేపీకి చాలా ముఖ్యం. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రావాలంటే తెలంగాణలోనూ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి. ఇప్పుడు బీజేపీకి నాలుగు సీట్లు ఉండగా.. దానిని 8కి పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో 20 సీట్ల వరకు వచ్చేవనే అభిప్రాయం బీజేపీ నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సైతం రిస్క్ తీసుకోకుండా.. బండి సంజయ్ ఆధ్వర్యంలోనే లోక్సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల వరకే తాను అధ్యక్షుడిగా ఉంటానని అప్పట్లో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పు అనివార్యం. బండి సంజయ్తో మాజీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేరు కూడా అధ్యక్షుడి రేసులో వినిపిస్తోంది. ఇద్దరూ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలే కావడంతో లక్ష్మణ్ను సైతం అధ్యక్షుడిని చేసే అవకాశం లేకపోలేదు. అయితే బండి సంజయ్ ఆధ్వర్యంలోనే పార్టీ గ్రాఫ్ పెరిగింది. బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామే అనే స్థాయికి బీజేపీ ఎదిగింది. ఆయనకు యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధిష్టానం బండి సంజయ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.