Bhatti Vikramarka: ప్రజల కష్టాలు తీరబోతున్నాయి.. మల్లు భట్టి విక్రమార్క
X
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఈ రోజు మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ క్రమంలో ప్రమాణ స్వీకారానికి బయలుదేరడానికి ముందు- భట్టి విక్రమార్క తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పదవి ఆశించిన మాట వాస్తమేనన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందని , అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరికీ పదవులు దక్కడం అసాధ్యమని చెప్పారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడబోతుందన్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేసిందని, పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశానని , ఇకపై వారి సమస్యలు తీరబోతున్నాయన్నారు. సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.