Komatireddy Venkat Reddy : తమ్ముడి రాజీనామాపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన
X
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్న విషయంలో తనకెలాంటి సమాచారం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ కథనాలన్ని మీడియా ద్వారానే తెలిశాయన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరిక విషయాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుందన్నారు. ఎవరు? ఎక్కడ? పోటీ చేయాలనే విషయమై కాంగ్రెస్ నాయకత్వానిదే తుది నిర్ణయమన్నారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తుల విషయంపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు విడుదలయ్యే అవకాశం ఉందని వెంకట్ రెడ్డి చెప్పారు. 10-15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుందన్నారు.
అభ్యర్థుల రెండో జాబితా గురించి ప్రస్తావిస్తూ.. సీఈసీ (CEC) ఫైనల్ అయ్యేవరకు బయట మాట్లాడకూడదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదని, మిర్యాలగూడలో కూడా అడిగారని, అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్స్‌ఫర్ అవుతుందనేది చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులపై బుధవారం సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేరు చెప్పే అర్హత కేటీఆర్ (KTR)కు లేదని, రాహుల్ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదని, ఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.