Jithender Reddy : ఆయన్ని అధ్యక్షున్ని చేయండి.. 10ఎంపీ సీట్లు గెలుస్తాం : జితేందర్ రెడ్డి
X
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని అన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్‌ని తిరిగి అధ్యక్షునిగా చేస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి హైప్‌ను తీసుకువచ్చింది ఆయనే అన్న జితేందర్ రెడ్డి.. బీజేపీకి అధికారం వచ్చేవరకు బండి సంజయ్‌నే అధ్యక్షునిగా ఉంచాలన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. కానీ బండి సంజయ్‌ని తొలగించడంతో ప్రజలు క్రమంగా కాంగ్రెస్ వైపు మళ్లినట్లు తెలిపారు. ముందు బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమని ప్రజలు భావించారని.. కానీ బండి సంజయ్ తొలగింపు తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లారన్నారు.
కాగా కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు అధిష్ఠానం ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పింంచారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 8స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఓడిపోయారు. రాజాసింగ్ మాత్రం గోషామహల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. మరోవైపు బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అన్న భావనను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.