ఢిల్లీకి ఈటల రాజేందర్.. కీలక పదవి దక్కే ఛాన్స్
ఢిల్లీకి ఈటల రాజేందర్.. కీలక పదవి దక్కే ఛాన్స్
X
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన హస్తినకు వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. పార్టీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ రెండు వర్గాలుగా విడిపోయినట్లు అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో గ్రూపులను రూపుమాపే చర్యలను చేపట్టిన అధిష్ఠానం.. ఇందులో భాగంగానే ఈటలను దిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది.
ఈటలకు కీలక పదవిని అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఈటల సంతృప్తిగా లేరని... పదవి తప్ప, అధికారం లేదని ఆయన భావిస్తున్నట్టు చెపుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటలకు కీలక బాధ్యతలను అప్పగించడంపై రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం వెళ్లింది. అయితే ఈ సమాచారం తనకు తెలియదని బండి సంజయ్ మీడియాకు చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడ ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించాలని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరినట్టుగా ప్రచారం సాగింది. పార్టీ నాయకత్వం ఈ విషయమై సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడ ఇటీవల స్పష్టం చేశారు.