Telangana Assembly 2023 : అప్పులున్నాయని హామీలను విస్మరించొద్దు : మహేశ్వర్ రెడ్డి
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ మొత్తం 412 హామీలు ఇచ్చారని.. కానీ ఆరు గ్యారెంటీలపైన మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్నీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సెషన్లోనే కాంగ్రెస్ హామీలకు చట్టబద్ధత తీసుకురావాలన్నారు.
ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ ఊరుకోదని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ముందు ప్రతి రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి.. ఇప్పుడు వారంలో రెండు సార్లు నిర్వహించడం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తామన్నారు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చారని విమర్శించారు. గత ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసిందంటూ హామీలు అమలు చేయకపోతే బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సీఎంకు పాలనా అనుభవం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ల సలహాలతో ముందుకు వెళ్ళాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.