TS Assembly Elections 2023 : పుంజుకున్న బీజేపీ.. అలా చేయకుంటే ఎక్కువ సీట్లు వచ్చేవేమో..
X
తెలంగాణలో బీజేపీ గతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో ఒక స్థానంలో మాత్రమే గెలిచిన కమలం పార్టీ ఈ సారి 8స్థానాల్లో విజయం సాధించింది. ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ తన పట్టు నిలుపుకున్నారు. ఈ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు సహా ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తించారు.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి జెండా ఎగరేశారు. సీఎంపై ఆయన 5810 ఓట్ల తేడాతో గెలుపొందారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలిపొందారు. ఆదిలాబాద్ నుంచి శంకర్, నిజామాబాద్ అర్బన్‌లో సూర్యనారాయణ, ఆర్మూర్‌లో రాకేశ్‌రెడ్డి, ముథోల్‌లో రామారావు పవార్, సిర్పూర్‌లో పాల్వాయి హరీశ్ విజయం సాధించారు. ఇలా మొత్తం 8స్థానాల్లో కమలం పార్టీ తన సత్తా చాటింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ రెండింట్లో ఓడిపోయారు. సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్, కేసీఆర్పై గజ్వేల్లో పోటీ చేసి కంగుతిన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పరాజయం పాలయ్యారు. ఎన్నికల వేళ బండి సంజయ్ అధ్యక్షపదవి నుంచి తప్పించకపోతే కమలం పార్టీ మరిన్ని స్థానాల్లో ప్రభావం చూపించేది. ఎన్నికల వేళ అధ్యక్షుడి మార్పు ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. అదేవిధంగా బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటే భావనను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. ఇది కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. కవితను అరెస్ట్ చేయడకపోవడం వంటి అంశాలు ఆ పార్టీని 8సీట్లకే పరిమితం చేసింది.