TS Assembly Elections 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు కేసీఆర్ పర్యటన..
X
బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కల్లూరులో, 2 గంటలకు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సత్తుపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, ఇల్లెందు బీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్‌కు మద్దతుగా గులాబీ బాస్ ప్రసంగించనున్నారు. సభల నిర్వహణ ఏర్పాట్లు పూర్తికాగా.. భారీగా జనసమీకరణ చేయనున్నారు. ఇప్పటికే కల్లూరులో సభా ఏర్పాట్లను సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ బండి పార్థసారథిరెడ్డి పరిశీలించారు. సీఎం సభకు పోలీసు యంత్రాగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హెలీకాప్టర్‌లో బయలుదేరనున్నారు. నేరుగా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరుకు చేరుకొని.. అక్కడి సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కల్లూరులో సభ పూర్తికాగానే మధ్యాహ్నం 2 గంటలకు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి సీఎం చేరుకుంటారు. అక్కడి ప్రజా అశీర్వాద సభలో స్పీచ్ ఇవ్వనున్నారు. ఇల్లెందు బీఆర్‌ఎస్ అభ్యర్థి హరిప్రియ విజయాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఇల్లెందులో తొలి ప్రచార సభలో పాల్గొననున్నారు.
అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సరిగ్గా 5 రోజుల క్రితమే తొలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసీఆర్. గత నెల 27న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ప్రచార సభ విజయవంతం కావడంతో.. అదే జోష్‌తో సత్తుపల్లి , ఇల్లెందు నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగసభలకు పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది. కల్లూరు సభ ప్రాంగణాన్ని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణువారియార్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లెందు సభా ప్రాంగణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ పరిశీలించారు.