KCR : ఫలితాల తర్వాత కనిపించని కేసీఆర్.. ప్రమాణస్వీకారానికి వస్తారా..?
X
తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపనుంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే సొంత వాహనంలో ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు.
రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైకు రాజీనామా లేఖ అందజేస్తారని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓఎస్డీతో రాజీనామా లేఖను గవర్నర్ కు పంపిన కేసీఆర్ నేరుగా ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పట్లో హైదరాబాద్ తిరిగొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం రాజ్ భవన్లో జరిగే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరుకాకపోవచ్చని, బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో తీవ్ర అంసతృప్తిలో ఉన్న కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున దానికి సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసే పనిలో బీజీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర పోషిస్తూనే వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో కీలకంగా మారాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.