Telangana Elections 2023 : ఛాలెంజ్ ఓడానని గుండు గీయించుకున్నాడు.. అసలు విషయం తెలిసి..
X
తెలంగాణలో జరిగిన ఎన్నికలపై వెయ్యి కోట్ల రూపాయల బెట్టింగులు నడిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కంటే కూడా పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ఈ బెట్టింగ్‌ల జోరు కొనసాగింది. 100కు వేయి, వేయికి పదివేలు, పదివేలకు లక్ష.. ఇలా కోట్లలో పందాలు కాసి గెలిచారు కొందరు. ఓడి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కానీ విచిత్రంగా ఎన్నికల ఫలితాలపై ఛాలెంజ్ చేసి గెలిచిన ఓ కౌన్సిలర్... గుండు గీయించుకోవడం తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడి కాగా.. రామాయంపేట మండల పరిధిలో పార్టీల వారీగా వచ్చే ఓట్లపై కౌంటింగ్‌కు ముందు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య చర్చ జరిగింది. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ కు చెందిన 11వ వార్డు Councilor గంగాధర్ తన అభిప్రాయం వెలిబుచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో.. కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు రాకుంటే తాను గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు. ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ, BRS కే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ ఆ పార్టీ నేతలు ఫలితాల రోజున తప్పుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లను గమనించని గంగాధర్.. వారు చెప్పిందే నమ్మి, కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయనుకొని గుండు గీయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు గంగాధర్‌ను కలిసి.. తమ పార్టీ(కాంగ్రెస్)కే ఎక్కువ ఓట్లు లభించాయని వివరించారు. తన సొంత పార్టీ(BRS) నేతలే తనను తప్పుదారి పట్టించారని, అందుకు క్షమాపణ చెప్పాలని గంగాధర్ డిమాండ్ చేశారు.
మెదక్ నియోజకవర్గ పరిధిలో మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట్ మండలాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 85.32 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తెలంగాణ అసెంబ్లీ తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించగా.. తాజాగా.. ఎన్నికల్లో రోహిత్ కాంగ్రెస్ జెండా ఎగురేశారు.