Harish Rao : ఉమ్మడి మెదక్‌లో హరీష్ కరిజ్మా.. కీలక స్థానాలు సహా 7 కైవసం..
X
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా కొన్ని చోట్ల పట్టు గట్టిగా బిగించింది. కాంగ్రెస్ హవాను అడ్డుకట్ట వేసిన అభ్యర్థులను గెలిపించుకుంది. కీలక స్థానాలు ‘చేతికి’ చిక్కకుండా జాగ్రత్త పడింది. హరీష్ రావు సారథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 స్థానాలకు గాను 7 స్థానాలు గులాబీ జెండా కిందకి వచ్చాయి. కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన గజ్వేల్‌తోపాటు సంగారెడ్డి, దుబ్బాక స్థానాలను ప్రత్యర్థి పార్టీల ఖాతా నుంచి తన ఖాతాలో వేసుకుంది. నర్సాపూర్, పటాన్ చెరువు, జహీరాబాద్ స్థానాల్లోనూ విజయ భేరీ మోగించింది. సిద్దిపేట సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. హరీశ్ రావు 82వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం సాధించారు.
60 రోజుల్లో సభలు, ర్యాలీల్లో పాల్గొన్న హరీశ్ రావు బీఆర్ఎస్ పునాదులను పటిష్టం చేయడానికి తన వంతు కృషి చేశారు. గులాబీ ఓటు బ్యాంకు పెద్దగా చీలకుండా జాగ్రత్త పడ్డారు. అసంతృప్తి నేతలతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. కేసీఆర్ గెలుపుకోసం శ్రమించారు. అయితే అందోల్, మెదక్, నారాయణ్ ఖేడ్ స్థానాలను మాత్రం కాపాడుకోలేకపోయారు. ఇదివరకు కరీం నగర్ జిల్లాలో ఉండి ప్రస్తుతం మెదక్ జిల్లాలో భాగమైన హుస్నాబాద్ నియోజక వర్గంలోనూ బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ఆ పార్టీ అభ్యర్థి వొడితల సతీశ్ కుమార్ ను కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓడించారు.