Dasoju Shravan : కాంగ్రెస్కు ఆ విషయం కూడా తెలియకపోవడం సిగ్గుచేటు..
X
కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అధికారం రాకముందే కాంగ్రెస్ నేతలు లేకితనం చూపిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు 70సీట్లు రావడం ఖాయమని.. ఎగ్జిట్ పోల్స్కు ఎగ్జాట్ పోల్స్కు మధ్యా చాలా తేడా ఉంటుందన్నారు. రైతు బంధు డబ్బులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు అధికారులు ఈసీ పరిధిలోనే పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ఈ విషయం కూడా తెలియకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
తెలంగాణ ప్రజలతో కేసీఆర్ది పేగుబంధం అని దాసోజు అన్నారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎందుకంటూ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని.. ఇది వారి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏ సీఎం అయిన కేబినెట్ మీటింగ్ పెట్టి.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పారు. దీనిపై కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు. కర్నాటక నేతలకు తెలంగాణలో ఏం పని అని దాసోజు ప్రశ్నించారు. కర్నాటక ప్రజల సమస్యలను గాలికొదిలేసి.. తెలంగాణ మీద పడ్డారని విమర్శించారు.