Kaushik Reddy : ఓటేయకుంటే కుటుంబమంతా ఉరేసుకొని చస్తాం.. బీఆర్ఎస్ అభ్యర్థి
X
ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.. తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలో తన భార్య, కూతురితో కలిసి ప్రచారం చేపట్టిన ఆయన ఎమోషనల్ గా మాట్లాడుతూ.. 3 వ తేదిన ప్రజలంతా ఓట్లేసి దీవిస్తే ఎన్నికల జయయాత్రకు వస్తానని, లేకపోతే నాలుగో తేదీన అందరూ తన శవయాత్రకు రావాలంటూ పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. తన భార్య, బిడ్డతో పాటు తనను సాదుకుంటారో చంపుకుంటారో ఆలోచన చేయాలన్నారు.
‘మా జీవితాలు, ప్రాణాలు మీ చేతుల్లోనే పెడుతున్నా. నన్ను దీవించి గెలిపిస్తరా.. లేదంటే మేం ఉరి తీసుకోవాల్నా ఆలోచించండి’ అంటూ ఏమోషనల్ అయ్యారు. ‘మీ దయ, దండం.. మమ్ముల మీరే కాపాడుకోవాలే. లేదంటే మా ముగ్గురి శవాలు చూస్తరు’ అంటూ కామెంట్లు చేశారు. మీరు ఓటేసి దీవిస్తే నాలుగో తేదీన జైత్రయాత్ర లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రేనన్నారు. దీంతో కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే యోచనలో ప్రత్యర్థులు ఉన్నారు.