Kadiyam Srihari : గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ అభ్యంతరం
X
అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్ స్పీచ్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదని చెప్పారు. తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఆమె స్థాయికి తగవని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమన్న ఆయన.. 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తమయిందని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్న కడియం.. ఆమె స్పీచ్ కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుగా ఉందని సెటైర్ వేశారు.
బీఆర్ఎస్ హాయాంలో తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో సాధించిన అభివృద్ధిని విస్మరించారని కడియం విమర్శించారు. తెలంగాణ ప్రస్థానం తిరోగమన దిశలో సాగుతున్నట్లు చెప్పే ప్రయత్నం చేశారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో గవర్నర్ చెప్పలేదన్న కడియం... ఆ పార్టీ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తుందో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావనే లేకపోవడాన్ని తప్పుబట్టారు.