Harish Rao : జాకీలు పెట్టి లేపినా బీజేపీ లేవదు.. కాంగ్రెస్ గెలవదు - హరీష్ రావు
X
రేపో, మాపో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల కోసం ఇంకేం చేయొచ్చని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని హరీష్ రావు కోరారు.
కాంగ్రెస్ పార్టీకి రైతులపై ప్రేమ లేదని అందుకే వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని చెబుతున్నారని హరీష్ విమర్శించారు. అలాంటి పార్టీకి పొరపాటున ఓట్లేస్తే ప్రజల పరిస్థితి కైలాసంలో పెద్ద పాము మింగినట్లే అవుతుందని అన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని హరీష్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఫేక్ సర్వేలు పెడుతూ సంతోషిస్తోందని అన్నారు.
తెలంగాణలో జాకీలు పెట్టి లేపినా బీజేపీ లేవదు.. కాంగ్రెస్ గెలవదని హరీష్ అభిప్రాయాపడ్డారు. కేసీఆర్ దెబ్బకు బీజేపీ డకౌట్ అయితే కాంగ్రెస్ రనౌట్ అవుతుందని, కేసీఆర్ సెంచరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరన్న హరీష్.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ అని అన్నారు. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలిచిన తమ పార్టీ ఈ సారి 100 సీట్లు గెలిచి సెంచరీ కొడుతుందని హరీష్ జోస్యం చెప్పారు.