KCR : కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల రెండో జాబితా.. ఛాన్స్ ఎవరికంటే..?
X
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవడంతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. హ్యాట్రిక్ విక్టరి కొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 115మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా.. రెండో లిస్ట్ ప్రకటించేందుకు రెడీ అయ్యింది. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ స్థానాలకు కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు మల్కాజ్ గిరి స్థానానికి సైతం అభ్యర్థిని ప్రకటించనున్నారు. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో ఆ స్థానం కూడా పెండింగ్లో ఉంది.
మంత్రి కేటీఆర్ ఈ 5 స్థానాలపై పార్టీ సీనియర్లతో పాటు ఆయా నియోజకవర్గ నేతలతో చర్చించారు. ఈ క్రమంలో అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ సునీతా రెడ్డికి కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమించారు. అయితే నాంపల్లి, గోషామహల్ స్థానాలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అటు మల్కాజ్ గిరి స్థానానికి మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తున్నా.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.