Assembly Election 2023 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ బిజీ..
X
థంబ్ : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. సాయంత్రం 5గంటలకు ప్రచార గడువు ముగిసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో గంట ముందే క్యాంపెయినింగ్ క్లోజ్ కాగా.. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఐదింటికి రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. క్యాంపెయినింగ్ గడువు ముగియడంతో రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ప్రకటనలకు బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ ముగిసే వరకు ప్రీపోల్, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ప్రచురించడం, ప్రసారంచేయడంపై ఆంక్షలు విధించారు.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా.. 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.26కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుష ఓటర్ల సంఖ్య 1,62,98,418 కాగా, మహిళలు ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు. 2,676 మంది థర్డ్ జెండర్, 15,406 సర్వీస్ ఓటర్లు, ఓవర్సీస్ ఓటర్ల సంఖ్య 2,944 మంది ఉన్నారు.
30న జరిగే పోలింగ్ కోసం రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వాటిలో 10 వేలకుపైగా సమస్యాత్మకంగా పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాదాపు 2.5లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారు.
45వేల మంది పోలీసులు భద్రత విధులు నిర్వహించనున్నారు. 50శాతం పోలింగ్ సెంటర్లలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలు భద్రతా విధులు నిర్వర్తించనున్నాయి.