Mallu Bhatti Vikramarka : గ్రూప్ 1 పరీక్ష కోసం దశాబ్ధం ఎదురుచూడాల్సిన పరిస్థితి.. సీఎల్పీ నేత మల్లు భట్టి
X
ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారని, వారంతా ప్రజాస్వామ్య తెలంగాణ కోరుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో రూ.5లక్షల కోట్ల అప్పులను ప్రభుత్వం మిగిల్చిందన్నారు. ఆదాయం వచ్చే నాలుగు శాఖలపైనే దృష్టి పెట్టారని.. మిగిలిన శాఖలను గాలికొదిలేశారన్నారు. పదేళ్లలో ఉద్యోగాల కల్పన లేదన్నారు. గ్రూప్ 1 పరీక్షకు దశాబ్ధం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందన్నారు. సమసమాజ స్థాపనకు కాంగ్రెస్ అడుగులు వేస్తోందన్నారు. కాంగ్రెస్‌పై బుదర జల్లి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు.
ఇందిరమ్మ రాజ్యంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ నుంచి తాను ఖమ్మం వరకు పాదయాత్ర చేశానన్నారు. గోండు గూడాల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో పవర్ ప్లాంట్‌లు ఇంకా ఉత్పత్తికి రాలేదన్నారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ల ద్వారానే కరెంట్ సరఫరా అవుతోందన్నారు. ఈనాటి కరెంట్ సప్లయ్ బీఆర్ఎస్ తీసుకొచ్చిన పవర్ ప్రాజక్ట్స్ ప్రొడక్షన్ వల్ల కాదని, నాటి యూపీఏ ప్రభుత్వం వల్లే ప్రస్తుతం 24 గంటలు కరెంట్ సరఫరా అవుతుందన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవంటే దానికి గత ప్రభుత్వాలే కారణమన్నారు. బీహెచ్‌ఈఎల్ లాంటి ఒక సంస్థను కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేయలేదన్నారు. తమ హయంలోనే ఎస్సారెస్పీ, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లు కట్టామన్నారు. బీఆర్ఎస్ చేసిందేం లేదు కాబట్టే కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తుందన్నారు. కరెంట్ విషయంలో కర్ణాటకకు, తెలంగాణకు పొంతన లేదన్నారు భట్టి. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం కర్నాటకలో కరెంట్ కష్టాలని చెప్పారు.