KCR : ధరణి వద్దన్న వారికి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలి.. సీఎం కేసీఆర్
X
ఎన్నికలు రాగానే ఆగమాగం ఓటర్లు కావొద్దన్నారు గులాబీ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల దగ్గర ఉండే ఓటు వజ్రాయుధమని, అన్ని పార్టీల అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని ఆలోచించి ఓటు వెయ్యాలన్నారు. మంగళవారం మందమర్రి నియోజకవర్గం చెన్నూరు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసమని అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజలే బాస్ అని అన్నారు. ప్రజలు ఆశలు ఆకాంక్షలు తెలిసిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. సమైక్యపాలనలో గత దశాబ్ధాలుగా ఇబ్బంది పడ్డామన్నారు. ఇష్టం లేకున్నా తెలంగాణను ఆంధ్రలో కలిపారన్నారు. సింగరేణి అచ్చంగా తెలంగాణ కంపెనీ అని.. గత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని కేంద్రానికి కట్టబెట్టిందన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల్లో పడిందని చెప్పారు. ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటున్నామన్నారు. రైతులను ఏనాడు కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు గులాబీ బాస్. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ధరణి వద్దన్న వారికి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలన్నారు. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని ఈ సభలో అన్నారు.