KCR : చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడతలో దళితబంధు.. సీఎం కేసీఆర్
X
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు సీఎం కేసీఆర్. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు గత నెలలో ఫిర్యాదు చేస్తే.. తన విజ్ఞప్తి మేరకు ఈనెల 28న రైతుబంధు ఇచ్చేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ ఫిర్యాదు చేయడం వల్ల రైతుబంధును ఈసీ ఆపేసిందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్యకు మద్దతుగా ప్రసంగించారు. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్ భూములకు పట్టాలపై సంతకం చేస్తామన్నారు గులాబీ దళపతి. తాము తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయన్నారు . రైతుల వేలిముద్ర లేకుండా భూ రికార్డులను సీఎం కూడా మార్చలేరన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే.. ఆ భూమి మీద హక్కులు పోతాయన్నారు. ఎస్సీ నియోజకవర్గమైన చేవెళ్లలో కాలే యాదయ్య కోరినట్టు దళితబంధు వచ్చేటట్టు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అందరికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేస్తానని చెప్పారు. దళితబంధు ఒకే విడుతలో వస్తది కాబట్టి.. ఒక్క దళిత ఓటు కూడా వేరే పార్టీకి పడొద్దు అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇక అందోల్ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తాను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాక కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చిందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని, రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని చెప్పారు. రైతుబంధు ఆగితే కాంగ్రెస్‌కు ఓట్లు వస్తాయని భావిస్తున్నారని, డిసెంబర్ 3న బీఆర్ఎస్ సర్కారు వస్తుందని, మళ్లీ సంతోషంగా రైతుబంధు ఇస్తామన్నారు.