KCR : కాంగ్రెస్ అసమర్థతతోనే సింగరేణిలో 49శాతం వాటా కోల్పోయాం - కేసీఆర్
X
134 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణి తెలంగాణ కొంగుబంగారమని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో సింగరేణి 100శాతం తెలంగాణ సొత్తుగా ఉండేదని కాంగ్రెస్ పాలకుల అసమర్థత వల్ల సింగరేణిలో 49శాతం కేంద్రానికి ఇవ్వాల్సి వచ్చిందని మండిప్పాడుర. అన్నారు. కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు సకాలంలో చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేసీఆర్ చెప్పారు. కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ హయాంలో సింగరేణి నష్టాల్లో ఉండేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేండ్లలోనే పరిస్థితి మారిపోయిందని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో 11 వేల కోట్లుగా ఉన్న సింగరేణి టర్నోవర్ ప్రస్తుతం 33వేల కోట్లకు చేరిందని కేసీఆర్ చెప్పారు. అప్పట్లో సంస్థ రూ. 419 కోట్లుగా ఉన్న సంస్థ లాభం ఇప్పుడు రూ.2,184 కోట్లకు చేరిందని చెప్పారు. గతంలో సింగరేణి కార్మికులకు రూ.60 నుంచి 70కోట్లు లాభాల్లో వాటా ఇస్తే ఈ ఏడాది దసరాకు రూ.700కోట్లు ఇచ్చామని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ తీసుకురావడంతో పాటు గని కార్మికులు చనిపోతే రూ. 10లక్షల పరిహారం ఇస్తున్నామని చెప్పారు. అర్హులైనవారందరికీ ఇండ్ల పట్టాలు అందజేసినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు గడుస్తున్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ వచ్చిందంటే ఏదో హడావిడి గందరగోళం అయిపోతదని, అబద్దాలు చెప్పడం, తిట్టుకోవడం, అభాండాలు వేయడం, మోసపూరిత వాగ్దానాలు చేయడం తంతుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలోనూ రాజకీయ పరిణితి రావాలన్న ఆయన.. ఓటు ఓ వజ్రాయుధమని దాన్ని సరిగా ఉపయోగించకపోతే ఐదేండ్ల తలరాత తలకిందులు అయితని అన్నారు. అందుకే అభ్యర్థుల గుణగణాలతో పాటు వారు పోటీ చేసే పార్టీ వైఖరి, చరిత్ర చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.