KCR : ధరణి తీసేస్తే మళ్లీ అధికారుల పెత్తనం వస్తది - సీఎం కేసీఆర్
X
రైతు సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. అన్నదాతలు బాగుపడాలన్న ఉద్దేశంతో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఆదిలాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో నీటి పన్ను రద్దు చేయడంతో పాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం, పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతు చనిపోతే వారంలోపు వారి కుటుంబసభ్యులకు రైతు బీమా పథకం కింద రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రైతు బంధు కింద ఇస్తున్న రూ.10వేలను ఐదేండ్లలో రూ.16వేలకు పెంచుతామని ప్రకటించారు.
కాంగ్రెస్ నేతల తీరుపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బంధు పేరుతో ప్రజలు కట్టిన పన్నులు దుబారా చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ అయితే ఏకంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదని 3 గంటలు చాలని అంటున్నారని విమర్శించారు. రైతుల భూముల రక్షణ కోసం ధరణి పోర్టల్ తెచ్చామని, కానీ తాము అధికారంలోకి వస్తే దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. అదే జరిగితే రైతుల బతుకులు మళ్లీ అధికారుల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు పైసలు అకౌంట్లలో ఎలా పడతాయని ప్రశ్నించారు.