KCR : ధరణి లేకపోతే రైతు బంధు, రైతు బీమా ఎట్ల ఇస్తరు - సీఎం కేసీఆర్
X
ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని మండిపడ్డారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రైతుల భూముల్లో గోల్ మాల్ జరగవద్దన్న ఉద్దేశంతో ధరణి పోర్టల్ తెచ్చామని అన్నారు. రైతు వేలిముద్ర పెడితే తప్ప భూమి రికార్డులను ఎవరూ మార్చలేరని చెప్పారు. ధరణి పోర్టల్ ఉండటం వల్లే రైతుబంధు, రైతు బీమా సాధ్యం అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ ధరణిని రద్దు చేస్తే ఈ పరిహారాలు ఎలా అందుతాయన్న ప్రశ్నకు కాంగ్రెస్ నేతల వద్ద సమాధానం లేదని అన్నారు.
ప్రజలు అభ్యర్థుల మంచి, చెడుతో పాటు గుణం గురించి ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. అంతేకాక అభ్యర్థుల పార్టీల చరిత్ర.. వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? పేదలు, రైతుల పట్ల ఆ పార్టీల వైఖరి ఎలా ఉంటుందనే దానిపైనా చర్చ జరగాలని అన్నారు. అలా జరిగితే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది. దాని ద్వారా మంచి జరిగే అవకాశముంటుందని చెప్పారు. పార్టీల వైఖరి, వారి ఆలోచనా సరళి చూసి అభ్యర్థులకు ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.