KCR : ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు అబద్దాలు చెప్తున్నయి - సీఎం కేసీఆర్
X
సమైక్య పాలకుల వైఖరి కారణంగా తెలంగాణ కొన్ని దశాబ్దాల పాటు వెనకబడిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. 2004లో ఇవ్వాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ పదేళ్లు ఆలస్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తగ్గిన ఆ పార్టీ గత్యంతరం లేని పరిస్థితుల్లో 2014లో ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారని కేసీఆర్ ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్ కు నిజాయితీ ఉంటే 2004 లేదా 2005లోనే తెలంగాణ ఇచ్చి ఉండేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారన్న కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు, నీటి సమస్య ఉండేదని ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. దేశంలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని తేల్చిచెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. సీతారామ ప్రాజెక్టు 70శాతం పూర్తైందని, గోదావరిపై కట్టిన ఈ ప్రాజెక్టు అందబాటులోకు వస్తే ఏడాదిలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు అబద్దాలు చెబుతున్నాయని, ప్రజలు ఆగమాగం కాకుండా కళ్లముందు జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.