TS Assembly Elections 2023 : కాంగ్రెస్ వస్తే.. రైతుబంధుకు రాంరాం.. ధరణిని తీసేస్తారు : కేసీఆర్
X
పదేళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉన్నదో గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమించుకుంటూ ముందుకుసాగమన్నారు. ప్రస్తుతం రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. జుక్కల్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసే చోట ఉందని.. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు.
కర్నాటకలో కరెంటు లేక రైతులు అరిగోస పడుతున్నారని కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చిన కర్నాటకలో 5గంటల కరెంట్ ఇస్తున్నామని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ 24గంటల కరెంట్ లేదన్నారు. రైతు బంధు పథకం వద్దంటూ కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని.. కానీ దానివల్ల రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల వల్ల కొంతమందికి రుణమాఫీ ఆగిపోయిందని.. ఎన్నికల తర్వాత అవి కూడా పూర్తవుతాయని చెప్పారు.
ఎమ్మెల్యే హన్మంత్ షిండేను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ఉండేవారని.. కానీ షిండే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చట్టారని.. ఎన్నికల తర్వాత మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే.. రైతుబంధుకు రాంరాం.. ధరణిని తీసేస్తారని ఆరోపించారు. కాబట్టి ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే వారిని గెలపించాలని పిలుపునిచ్చారు.