TS Assembly Elections 2023 : సిద్ధిపేట గడ్డ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను - సీఎం కేసీఆర్
X
రాజకీయ జన్మ ఇచ్చిన సిద్ధిపేటనే తనను సీఎం చేసిందని కేసీఆర్ అన్నారు. హరీష్ రావుకు మద్దతుగా సిద్ధిపేటలో నిర్వహించిన ప్రజా ఆశ్వీరాద సభలో ఆయన పాల్గొన్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారితే.. యావత్ తెలంగాణకు సిద్ధిపేట తలమానికంగా మారిందని ప్రశంసించారు. ప్రతి సందర్భంలో తనను విజేతగా నిలిపిన ఈ గడ్డ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని కేసీఆర్ స్పష్టం చేశారు.
మంచి నీళ్ల కోసం సిద్ధిపేట పడ్డ తిప్పల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని కేసీఆర్ అన్నారు. మంచినీళ్లకు కరువొస్తే వార్డుకో ట్యాంకర్ పెట్టించి నీళ్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వంద బోర్లు వేస్తే రెండింటిలో మాత్రమే తేమ తగిలిందని, కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని చెప్పారు. మిషన్ భగీరథ పథకానికి సిద్ధిపేట మంచినీటి పథకమే నాంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
సిద్ధిపేటలో చూడని చెరవు, పాదయాత్ర చేయని రోడ్డు లేదన్న కేసీఆర్ కష్టపడి జిల్లాను ఓ దరికి తెచ్చామని అన్నారు. బంగారు భూములున్నా సాగునీరు లేక పండించుకోలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ప్రాణాలకు సైతం తెగించి ఉద్యమం ప్రారంభించినప్పుడు సిద్ధిపేట ప్రజలు ఇచ్చిన మద్దతు ఎన్నిటికీ మర్చిపోలేనన్నారు. బై ఎలక్షన్స్లో సమైక్యవాదులు కోట్లు ఖర్చు పెట్టినా సిద్ధిపేట ప్రజలు 60వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి తన గౌరవం నిలబెట్టారని అన్నారు. ప్రతి ఎన్నికలప్పుడు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి వద్ద పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేస్తానంటే ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధం అర్థం చేసుకోవచ్చని కేసీఆర్ చెప్పారు.