KCR : ఎన్నికలప్పుడు వచ్చి ఐదేండ్లదాకా కనపడని నాయకులను నమ్మొద్దు - కేసీఆర్
X
ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరోచెప్పారని ఓటు వేయొద్దని కోరారు. ఎలక్షన్లు రాగానే వచ్చే కొందరు నాయకులు మళ్లీ ఐదేండ్ల దాక కనపడరని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని అన్నారు. 9 ఏండ్ల నాటి పరిస్థితులకు ఇప్పటికి ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు.
రైతుల బాధలు తనకు తెలుసని సీఎం కేసీఆర్ చెప్పారు. వారి భూములను టచ్ చేసే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. రైతు బొటనవేలి ముద్రతో తప్ప ముఖ్యమంత్రికి కూడా భూములు బదిలీ చేసే అవకాశం లేకుండా చేశానన్న కేసీఆర్.. ప్రాణం పోయినా ధరణిని రద్దు చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధరణిని బంగాళాఖాతంలో పారేస్తామని అంటున్నారని,
అలాంటోళ్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ధరణి, కాంగ్రెస్ పార్టీల్లో దేనిని బంగాళాఖాతంలో కలపాలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.
కాంగ్రెస్ కౌలు రైతుల దుకాణం మొదలుపెట్టిందని సీఎం కేసీఆర్ సటైర్ వేశారు. సాగుకు 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అలాంటి వారిని ప్రజలు బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న కేసీఆర్.. రైతుల మీద మళ్లీ అధికారులను రుద్దాలని చూస్తున్న విపక్షాలకు బుద్ధి చెప్పాలని కోరారు.