KCR : కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తది - సీఎం కేసీఆర్
X
కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అలంపూర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని అంటున్నారని అదే జరిగితే రైతుల భూములపై వారి అధికారం పోతుందని హెచ్చరించారు. గతంలో పాలమూరు నుంచి భారీగా వలసలు ఉండేవని, ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా ఎవరూ మాట్లాడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. పదేండ్లలో పాలమూరులో వచ్చిన మార్పును ప్రజలు గుర్తించాలని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పదేండ్లలో అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని అన్నారు. ఒకప్పుడు నీటి కోసం గోస ఉండేదని, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదన్న కేసీఆర్.. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.