Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : మహారాష్ట్రకు ఏం తక్కువ.. అయినా అభివృద్ధిలో మనకంటే వెనకే : కేసీఆర్

KCR : మహారాష్ట్రకు ఏం తక్కువ.. అయినా అభివృద్ధిలో మనకంటే వెనకే : కేసీఆర్

KCR  : మహారాష్ట్రకు ఏం తక్కువ.. అయినా అభివృద్ధిలో మనకంటే వెనకే : కేసీఆర్
X

తెలంగాణలో సరైన ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఒక వ్యక్తి కాదు.. ప్రజలు గెలవాలని చెప్పారు. పోటీ చేసే వ్యక్తి మంచోడా.. చెడ్డోడా అనేది ప్రజలు ఆలోచించుకుని ఓటెయ్యాలని సూచించారు. భైంసాలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎస్సారెస్పీ లిఫ్ట్ పూర్తైతే మథోల్, థానూర్, లోకేశ్వరం మండలాల్లో 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పొరుగున మహారాష్ట్రలో రోడ్లు ఎలా ఉన్నాయో.. తెలంగాణ రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు.

50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమిలేదని కేసీఆర్ విమర్శించారు. గత పదేళ్లుగా కడుపుకట్టుకుని రాష్ట్రాభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ఉచితంగా నీళ్లు, కరెంట్ సహా రైతులకు పెట్టుబడి సాయం, బీమా అందిస్తున్నట్లు చెప్పారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అంటుంటే.. మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అని అంటున్నారని.. కానీ తాము ప్రజలు చెప్పినట్లు ఇస్తున్నామన్నారు. దేశంలో 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.

మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా పెట్టమని తేల్చిచెప్పామని కేసీఆర్ చెప్పారు. ఏటా 25కోట్లు నష్టం వస్తున్నా రైతుల కోసం భరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నారని.. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి ఉంది కాబట్టే రైతు బంధు డబ్బు నేరుగా అకౌంట్లలో జమవుతుందని చెప్పారు. గత పదేళ్లలో కర్ఫ్యూ, మత కల్లోలాలు లేవన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్నే గెలపించాలని కోరారు.


Updated : 3 Nov 2023 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top