CM KCR : RRRతో ఇబ్రహీంపట్నం రూపురేఖలు మారిపోతాయ్ : కేసీఆర్
X
ఇబ్రహీంపట్నానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తైతే ఇబ్రహీపట్నంలో లక్ష ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డుతో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. ఓటు ఎంతో విలువైందని.. 5ఏళ్ల రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించే శక్తి ఉందన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగామని కేసీఆర్ తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. రాష్ట్రాభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్.. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. ఈ సారి గెలిస్తే రైతు బంధును 16వేలకు పెంచుతామని చెప్పారు.
రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో వారికి అండగా నిలిచామన్నారు. ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో భూసమస్యలకు చెక్ పెట్టామన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా జమవుతాయని ప్రశ్నించారు.
దేశంలో దళితబంధు అనే పథకాన్ని తెచ్చిందే బీఆర్ఎస్ అని కేసీఆర్ అన్నారు. ఈ సారి అధికారంలోకి వచ్చాక ఇబ్రహీంపట్నంలోని అర్హులైన వారందరికీ దళిత బంధు ఇస్తామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తిడి చేసినా వెనకడుగు వేయలేదని చెప్పారు. రైతుల కోసం 25వేల కోట్ల నష్టాన్ని భరించామన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని అడిగారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.