Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : తుమ్మ ముళ్లు కావాలా.. పువ్వాడ పువ్వులు కావాలా : కేసీఆర్

KCR : తుమ్మ ముళ్లు కావాలా.. పువ్వాడ పువ్వులు కావాలా : కేసీఆర్

KCR : తుమ్మ ముళ్లు కావాలా.. పువ్వాడ పువ్వులు కావాలా : కేసీఆర్
X

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఖమ్మం రూపురేఖలే మారిపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ప్రజలు ఎన్నికలు రాగానే ఆగం కాకుండా అభివృద్ధి చేసే పార్టీకి అండగా నిలవాలన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్ల ముందే కన్పిస్తోందని చెప్పారు. వికారంగా ఉన్న లకారం చెరువును సుందరంగా తీర్చిదిద్దామన్నారు. 75వేల నల్లా కలెక్షన్లతో ఖమ్మం నగరంలో ఇంటింటికి తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.

పువ్వాడ అజయ్ను గెలిపిస్తే ప్రజలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. తుమ్మ ముండ్లు కావాలో పువ్వాడ పువ్వులు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వ విజన్.. అజయ్ మిషన్తో ఖమ్మంలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. 300 కోట్లతో రఘునాధపాలెం మండలాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దేశంలోనే 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీటితో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు.

తుమ్మలపై సెటైర్లు..

అప్పట్లో తుమ్మల ఓడిపోతే పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చానని.. అయితే తనకే మంత్రి పదవి ఇచ్చిన అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు విర్రవీగే నేతలున్నారని.. బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ గడప తొక్కనియ్యను వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అటువంటి అహంకారులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమిలేదని.. వాళ్లు ఒక్కనాడైన తెలంగాణ ఉద్యమాన్ని నడిపారా అని ప్రశ్నించారు. రాబోయేది ప్రాంతీయ యుగమే అని.. అభివృద్ధి కొనసాగాలంటే పువ్వాడ అజయ్ కుమార్ ను భారీ మెజర్టీతో గెలిపించాలని కోరారు.


Updated : 5 Nov 2023 12:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top