KCR : నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ అధినేత ఎన్నికల ప్రచారం
X
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలుత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అక్కడ జరిగే ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి గంగుల కమలాకర్ తరఫున ప్రచారం చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి చొప్పదండి నియోజవర్గానికి బయలుదేరుతారు.
మధ్యాహ్నం 2.35 గంటలకు చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం మధురానగర్ శివారులోని పత్తికుంటపల్లి కాలనీలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. స్థానిక బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోసం ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.45 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారు.