TS Assembly Elections 2023 : సిరిసిల్లలో ఆ రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం - సీఎం కేసీఆర్
X
ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. 70ఏండ్ల జీవితంలో సిరిసిల్లలో వందల సార్లు తిరిగానని, ఆ ప్రాంతంలో తన బంధువులు, మిత్రులు చాలా మంది ఉన్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
సమైక్యపాలనలో రాష్ట్రం ఆగమైందని కేసీఆర్ అన్నారు. వారి హయాంలో అప్పర్ మానేరు అడుగంటిపోయిందని, పోత్గల్ గ్రామంలో ఉన్న 15 - 20 రైస్ మిల్లులు కనుమరుగయ్యాయని చెప్పారు. అయితే స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రస్తుతం మానేరు సజీవ జలధారగా మారిందని, ఎండాకాలంలోనూ ఎగుమ మానేరు మత్తడి దూకుతోందని సంతోషం వ్యక్తంచేశారు.
గతంలో సిరిసిల్లలో గోడలపై ఆత్మహత్యలు చేసుకోవద్దన్న రాతలు చూసి ప్రొఫెసర్ జయశంకర్ సార్, తాను కన్నీళ్లు పెట్టుకున్నామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో ఎందుకీ కష్టాలని బాధపడ్డామని అన్నరు. చేనేత కుటుంబాలను అండగా ఉండాలని నిర్ణయించుకుని నేతన్నల కుటుంబాలకు రూ.50లక్షలు ఆర్థిక సాయం ఇచ్చానని చెప్పారు. కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాక చేనేతల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, నేతన్నల ఆత్మహత్యలు లేకుండా చేశారని ప్రశంసించారు. నేతన్నలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న కేసీఆర్.. సిరిసిల్ల మరో షోలాపూర్లా మారాలని ఆకాంక్షించారు.