Home > తెలంగాణ > Telangana Elections 2023 > CM KCR: నేడు మూడు జిల్లాల్లో కేసీఆర్ సభలు

CM KCR: నేడు మూడు జిల్లాల్లో కేసీఆర్ సభలు

CM KCR: నేడు మూడు జిల్లాల్లో కేసీఆర్ సభలు
X

బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా ముథోల్‌ , ఆర్మూరు, కోరుట్లలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ముథోల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ నేడు(శుక్రవారం) భైంసా పట్టణంలో నిర్వహించే సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కోరారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు రానుండగా.. స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమాయత్తమయ్యారు.

ముథోల్ బహిరంగ సభ తర్వాత ఆర్మూర్‌ పట్టణంలోని ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఆలూర్‌ బైపాస్‌ రోడ్డులో 63వ నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకొని ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో జరగబోయే ఈ సభకు సుమారు లక్ష మంది రానున్నారు. మధ్యాహ్నం కేసీఆర్‌ హెలిక్యాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకొని ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సభకు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో శుక్రవారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరవుతుండడంతో ఏర్పాట్లను ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత గురువారం రాత్రి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

ఇక ఆర్మూర్ తర్వాత.. కోరుట్లలో సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొనున్నారు. 63వ జాతీయ రహదారి పక్కన పెద్దగుండు ప్రాంతంలో సుమారు 12 ఎకరాల స్థలంలో తలపెట్టిన సభ కోసం ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆశీర్వాద సభ వేదిక, వేదిక ముందు ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్‌కు జాతీయ రహదారికి అవతలివైపు స్థలాన్ని కేటాయించారు. సభ వేదికకు సమీపంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగనుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే సమయానికి హెలీకాప్టర్‌లో అక్కడికి చేరుకుంటారు. బహిరంగ సభకు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లోని నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సభావేదిక, హెలీప్యాడ్‌, పార్కింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ పరిశీలించారు. పోలీస్‌ అధికారులకు భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.



Updated : 3 Nov 2023 9:36 AM IST
Tags:    
Next Story
Share it
Top