అనుమానమే లేదు.. కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావు.. సీఎం కేసీఆర్
X
మధిరలో గతంలో బీఆర్ఎస్ వి ప్రజలు ఓడించారని, ఈసారి మాత్రం గెలిపించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలోని ప్రతి ఇంచూ తనదేనని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వడంలో అనేక సార్లు కాంగ్రెస్ చేసిందని.. తప్పని సరి పరిస్థితిలో ఇచ్చిందన్నారు. మన మీద ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు. కాంగ్రెస్ చరిత్ర మోసాల చరిత్ర అని మండిపడ్డారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిందని స్పష్టం చేశారు.
దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘‘మధిర నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే నష్టమే. రైతుబంధు ఇవ్వొద్దు.. కరెంట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ అంటోంది. ఉత్తర భారతదేశంలో దళితులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. దళితుల ఓటు ఒక్కటి కూడా కాంగ్రెస్ కు పడకూడదు. దళితబంధు లాంటి ఆలోచన ఏనాడైనా కాంగ్రెస్ చేసిందా?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కమల్‌రాజును గెలిపిస్తే.. మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని.. కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు.
మధిరలో కాంగ్రెస్ గెలిచినా ఈ ప్రాంతంపై వివక్ష చూపలేదన్నారు కేసీఆర్. సోల్లు పురాణం చెబుతూ కాంగ్రెస్ ఏమార్చే ప్రయత్నం చేస్తున్నదని, మార్పు రావాలంటే మధిరలోనూ మార్పు రావాలన్నారు. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయ్యేది లేదని, ఎలక్షన్ల తర్వాత భట్టి మధిరకు చుట్టచూపుగానే వస్తారన్నారు.