KCR : మానకొండూరు సభలో ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్
X
కాంగ్రెసోళ్లు గెలిస్తే.. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తమని చెబుతున్నరని.. ఆ ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెడతడు అని కాంగ్రెస్ పై చురకలు వేశారు సీఎం కేసీఆర్. ఇందిరమ్మ రాజ్యం బాగోలేక మరో పార్టీ పుట్టిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ లేవని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని చెప్పారు. మానకొండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం తెలంగాణను మోసం చేయడానికని విమర్శించారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలిపోయిందని కేసీఆర్ విమర్శించారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని, 58 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను పిట్టలను కాల్చినట్లు కాల్చిపడేశారు. మలి దశ ఉద్యమంలో బీఆర్ఎస్ భాగమైంది. తెలంగాణ ఇస్తామంటే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నామన్నారు. అయినా తెలంగాణ రాకపోయేసరికి ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేశాం. ఆ ఉద్యమంలో రసమయి బాలకిషన్‌లాంటి వాళ్లు భాగమై ధూంధాం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనేక పోరాటాల తర్వాత కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ తరువాత కూడా తెలంగాణ ఇవ్వడానికి వారికి మనసు రాలేదు. సకలజనుల సమ్మె అంటూ మళ్లీ ఉద్యమం చేస్తే గానీ తెలంగాణ సాకారం కాలేదని కేసీఆర్ అన్నారు.
నవంబర్ 30 న ఎన్నికల పోలింగ్ జరుగునున్న క్రమంలో... రాయి ఏదో రత్నమేదో గుర్తించి ప్రజలు ఓటేయ్యాలన్నారు. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. రైతుల కోసమే పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని పెట్టామన్నారు. రైతు బీమా కింద రూ. 5లక్షలు ఇస్తున్నామని, దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే.. వారంలోపే ఆ పరిహారాన్ని అందజేస్తున్నామన్నారు. వరి ధాన్యం అమ్మినప్పుడు మీ గ్రామాల్లోనే కనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సమయానికి మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రైతు బంధు ఉందా అని ప్రశ్నించారు కేసీఆర్. కాంగ్రెస్ వస్తే ధరణీ తీసి బంగాళాఖాతంలో వేస్తం అని ఆ పార్టీవాళ్లు అంటున్నడని, ధరణీ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం, బ్రోకర్ల రాజ్యమే వస్తుందన్నారు. ధరణీ వల్లే మీకు రైతుబంధు వస్తోందని రైతులనుద్దేశించి అన్నారు కేసీఆర్ . అందుకే ఆలోచించి ఓటు వెయ్యాలన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారని.. ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి ఉండడం వల్లే రైతు బంధు నిధులు సకాలంలో జమవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తడి చేసిన పెట్టలేదన్నారు. రైతుల కోసం 25వేల కోట్ల నష్టాన్ని భరించామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ ఛార్జీ, సర్టిఫికెట్ అయ్యే ఖర్చు రద్దు చేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో అర్హులు అందరికీ దళితబంధు అందిస్తామన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ను 80 వేల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.