Home > తెలంగాణ > Telangana Elections 2023 > నేడు కొత్తగూడెం, ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభలు.. మూడోసారి..

నేడు కొత్తగూడెం, ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభలు.. మూడోసారి..

ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగం

నేడు కొత్తగూడెం, ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభలు.. మూడోసారి..
X



బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో జరిగిన సభలకు హాజరైన సీఎం కేసీఆర్.. మూడోసారి ఖమ్మం, కొత్తగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకొని పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిస్తారు. పార్టీ నేతలు ఈ సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొని.. బీఆర్ ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. సీఎం రాక సందర్భంగా ఖమ్మం నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ గులాబీమయమయ్యాయి. సభ ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పర్యవేక్షించారు. కొత్తగూడెం సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు, బీఆర్ ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జి వావిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పరిశీలించారు.

సీఎం కేసీఆర్ వస్తున్నందున రెండు బహిరంగ సభలకు ఆయా జిల్లాల పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలోని పాలెట్ స్టేడియం, కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌లో హెలిప్యాడ్‌లను అధికారులు సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, ఆశీర్వాద సభలకు రెండు నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.


Updated : 5 Nov 2023 3:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top