CM Revanth Reddy : డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన : సీఎం రేవంత్
X
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ సమావేశమయ్యారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. ప్రజాపాలన పేరుతో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పారు.
ప్రభుత్వ ప్రాధాన్యత అంశాన్ని కలెక్టర్లకు సీఎం వివరించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. అదేవిధంగా ప్రజావాణిని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఇక గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.