CM Revanth Reddy : కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చ
X
సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సమావేశం జరగనుంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన కార్యక్రమాలపై సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా భవన్లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారు.
ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటలవరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.