Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : ఇవాళ ఢిల్లీకి రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై చర్చ..

Revanth Reddy : ఇవాళ ఢిల్లీకి రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై చర్చ..

Revanth Reddy  : ఇవాళ ఢిల్లీకి రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై చర్చ..
X

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై హైకమాండ్‌తో చర్చిస్తారు. ఇవాళ రాత్రికి తిరిగి హైదరాబాద్ వస్తారు. నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో పదవుల పంపిణీతో పార్టీలో జోష్‌ తేవాలని హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ సహా 11 మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్లోకి ఇంకా ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్‌ హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారని టాక్ వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్‌ఖాన్‌కు మైనార్టీ కోటాలో అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్‌ అర్బన్‌లో ఓడిన షబ్బీర్‌ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కు కష్టమే. మల్కాజిగిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవిని ఆశిస్తుండగా.. ఆయనకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అంజన్‌కుమార్‌ యాదవ్‌, మధుయాష్కీలు కూడా ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి రేసులో ఉన్నారు. షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌లను ఎమ్మెల్సీలుగా చేసి మంత్రివర్గంలో తీసుకుంటారని వారి అనుచరులు గట్టిగా చెబుతున్నారు.

అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిలోకి తీసుకుంటారనే చర్చ సాగుతోంది. ఆదిలాబాద్‌ నుంచి గడ్డం వివేక్‌, వినోద్‌ సోదరులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. తనకు మంత్రి పదవి పక్కా అని వివేక్‌ ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మినిస్టర్ రేసులో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవీ ఇవ్వొద్దనే యోచనలో పార్టీ ఉందని మరో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమైతే ఓడిపోయిన వారికి మంత్రి పదవులు దక్కడం కష్టమే.


Updated : 19 Dec 2023 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top