CM KCR: గెలిపిస్తే.. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం
X
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కోదాడలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో కర్ఫ్యూ, కరవు రాలేదని అన్నారు.తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీ రామరక్ష అని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని.. తాను మాట్లాడేంత వరకు మనకు రావాల్సిన నీటి హక్కుల గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. 24 గంటల్లో నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రస్తావించారు. నాగార్జున సాగర్ పేరు నదిగొండ ప్రాజెక్టని తెలిపారు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సి ఉండగా.. గోల్‌మాల్ చేసి దిగువకు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. మనం కట్టాలనుకున్న ప్రాజెక్టును ఆపిందెవరని ప్రశ్నించారు. ప్రాజెక్టును ఆపితే నోర్మూసుకొని కూర్చున్నదెవరని నిలదీశారు. పంట పొలాలకు సంపూర్ణంగా నీరు అందించే బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు.
‘‘బీసీల చైతన్యం చూపించాల్సిన బాధ్యత కోదాడ ప్రజలపై ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య గెలవకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారు. మల్లయ్య యాదవ్ గెలవరంటూ చాలామంది అన్నారు. గెలవకున్నా పర్లేదు.. టికెట్ ఇస్తానని అని చెప్పాను. మలయ్య యాదవ్‌ను గెలిపిస్తే కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం. గతంలో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశాను. నేను పాదయాత్ర చేసిన సమయంలో కాలువలకు నీరు రాక ఇబ్బంది పడేవారు. కాళేశ్వరం నీళ్లు రాలేదని సీఎల్పీ నేత భట్టి చెబుతున్నారు. కోదాడకు మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంటే ఇస్తోంది. ఆ పార్టీని ప్రజలు నమ్మొద్దు. కరెంట్ 3 గంటలు కావాల్నా? 24 గంటలు కావాల్నా? తేల్చుకోవాలి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ ఉండదు, కారు చీకట్లే. రైతు బంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుంది? ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎలా వస్తాయి? బీఆర్ఎస్ మరోసారి గెలిస్తే రైతు బంధు రూ.16 వేల వరకు పెంచుతాం. ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు KCR. ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారనేది ఆలోచించాలని పేర్కొన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మస్త్రమని, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పంటపొలాలు ఎండాలా, పండాలా? అనేది నిర్ణయిస్తుందని చెప్పారు.