Bhatti Vikramarka : ఇండియా కూటమి నిరసనలు.. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ ధర్నా
X
పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమిలోని పార్టీల నేతృత్వంలో దేశవ్యాప్తంగా ధర్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా కూటమి పిలుపు మేరకు హైదరాబాద్లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరసన ప్రదర్శన జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు ధర్నాలో పాల్గొంటున్నారు. సాయంత్రం 4గంటల వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ధర్నాలో పాల్గొననున్నారు.
పార్లమెంటులో జరిగిన దాడిపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభల్లో కలిపి 140 మందికిపైగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. దీన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఇవాళ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓ ధర్నాలో ముఖ్యమంత్రి.. మంత్రులు పాల్గొనటం ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం హోదాలో కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, పార్టీ నేతలతో కలిసి ధర్నా చేశారు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ధర్నాలో పాల్గొననున్నారు.