Rahul Gandhi : నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాహుల్ గాంధీ
X
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుయాత్ర చేయనున్నారు. తొలుత మధ్యాహ్నం 2గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తికి చేరుకుని.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బస్సు ద్వారా జడ్చర్లకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బస్సు ద్వారానే షాద్‌నగర్‌కు వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కొంతదూరం పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. మంగళవారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌విజయభేరి సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో బుధ, గురువారాల్లో జరగాల్సిన రాహుల్ పర్యటన ఒక రోజు ముందుకు జరిగింది. ఆయన మంగళవారమే హైదరాబాద్‌కు వచ్చి కొల్లాపూర్ విజయభేరి సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రజలతో తమకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ సంబంధమని అందుకే ముఖ్యమైన సమావేశాలున్నా కాదనుకుని కొల్లాపూర్ సభకు హాజరయ్యామని రాహుల్ తెలిపారు.
వచ్చే ఎన్నికలు ప్రజల తెలంగాణకు.. దొరల తెలంగాణకు మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద మోసమని.. దాని ద్వారా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు.
కొల్లాపూర్‌లో ప్రియాంకగాంధీ సభ అనుకుంటే ఏకంగా రాహుల్‌గాంధీయే రావడంతో పార్టీ వర్గాలో సంతోషం వ్యక్తమైంది. కాగా, రాహల్‌గాంధీ మంగళవారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో బస చేశారు. బుధవారం యధాతథంగా కల్వకుర్తి, జడ్చర్ల, షాద్ నగర్ చౌరాస్తాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. గురువారం రూపొందించుకున్న షెడ్యూల్ రద్దయింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో మరోమారు ఆయన పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.