TS Assembly Elections 2023 : బస్సు యాత్ర కుదింపు.. రేపు ఢిల్లీకి రాహుల్ గాంధీ..
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లా పర్యటన రద్దైంది. ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉండటంతో ఆయన పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం రాహుల్ గాంధీ నిజామాబాద్ లో నిర్వహించే పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో రేపు సాయంత్రం రాహుల్ గాంధీ హస్తినకు తిరిగి వెళ్లనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్లో మార్పు చేశారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో ముఖాముఖీ సమావేశం అవుతారు. వారితో ముచ్చటించిన అనంతరం హైదరాబాద్కు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన బస్సు యాత్రలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈసారి రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.