Home > తెలంగాణ > Telangana Elections 2023 > Rahul Gandhi : మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ
X

భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరిశీలించారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన కుంగిన లక్ష్మీ బ్యారేజీని రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఇతరులను అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీ కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు పరిశీలించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఇతరులను అనుమతి ఇవ్వలేదు. బ్యారేజి వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ మేడిగడ్డ బ్యారేజీ వైపునకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. అనుమతి లేదని పోలీసులు కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.

కాళేశ్వరం కాదు.. కరెప్షన్

ఇక అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు అంబటిపల్లి గ్రామానికి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే లు కేసీఆర్ పై , బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట టిఆర్ఎస్ ప్రభుత్వం కరెప్షన్ చేసిందన్నారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదన్నారు. ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయని ఆరోపించారు.

మోదీ, షా లు ఏం చేస్తున్రు?

ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని పది రోజులు కాకముందే కుంగివడం బాధాకరమని చెప్పారు. చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే.. భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదని ప్రశ్నించారు.

మేం ముందే చెప్పాం..

చిన్నపాటి ఇంటి నిర్మాణం కోసం ఇంజనీర్ తో డిజైన్ చేసుకుంటామని.. లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారని ప్రశ్నించారు. ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు కు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పిందని.. ఇప్పుడు అదే జరిగిందన్నారు.




Updated : 2 Nov 2023 10:30 AM IST
Tags:    
Next Story
Share it
Top