Rahul Gandhi : కేసీఆర్ దోచుకున్న సొమ్మును మీకు చెందేలా చూస్తా.. రాహుల్ గాంధీ
X
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకుని, రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంపై అప్పు భారాన్ని మోపారని తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. లక్ష కోట్ల తెలంగాణ సంపద దోపిడీకి గురైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నారు. గురువారం ఉదయం జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని అంబట్ పల్లిలో కాంగ్రెస్ మహిళా సదస్సు లో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎన్నికలు దొరల తెలంగాణ కు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చూస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. రాష్ట్ర మహిళలకు పలు హామీలిచ్చారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. మోదీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరిందని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని.. బీజేపీకి బీఆర్ఎస్ మద్ధతిస్తోందని అన్నారు. ఓటర్లంతా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.