Vijayashanthi : అన్నా అని పిలిచిన కేసీఆర్ ఓడిపోవడం బాధాకరం : విజయశాంతి
X
కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడంపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. స్వయంగా కేసీఆరే ఓడిపోయే స్థితికి బీఆర్ఎస్ను తెచ్చుకోవడం బాధాకరమన్నారు. ‘‘ఇద్దరే ఎంపీలుగా తెలంగాణకై కొట్లాడిన నాటి నుంచి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా.. నేను అన్నా అని పిలిచి కలిసి పనిచేసిన కేసీఆర్ తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయే స్థితికి బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకోవడం బాధాకరం. మొదట కేసిఆర్ ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు.. కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు.. పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండకపోయేవి. ఏది ఏమైనా కొత్తగా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతో కూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్, బీఆర్ఎస్ నుంచి తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది’’ అని రాములమ్మ ట్వీట్ చేశారు.
కాగా ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్, మెదక్ ఎంపీగా ఉన్న విజయశాంతి పార్లమెంట్లో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ వచ్చాక కొన్నాళ్లు టీఆర్ఎస్ లోనే ఉన్న రాములమ్మ ఆ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బీజేపీలో చేరారు. తెలంగాణ ఎన్నికల ముందు వరకు బీజేపీలోనే ఉన్న విజయశాంతి ఇటీవలె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో బీఆర్ఎస్ను వీడిన నుంచే కేసీఆర్ విధానాలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.