కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామాలు, వలసలు, అసంతృప్తులతో పార్టీలో గందరగోళం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 55 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీలో కొత్తగా చేరిన 11 మంది నేతలకు కూడా టికెట్ వచ్చింది. అంతేకాకుండా మైనంపల్లి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిల కుటుంబాలకు రెండేసి టికెట్లు ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో తొలి లిస్ట్ లో చాలామంది సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు టికెట్ దక్కకపోవడం గమనార్హం. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రచారం చేసిన షబ్బీర్ అలీకి టికెట్ దక్కలేదు. అంతేకాకుండా. పార్టీ సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి, కొండా సురేఖ, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి చాలామందికి మొదటి లిస్ట్ లో టికెట్ దక్కలేదు. దీంతో టికెట్ రాని ఆశావహులు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
ఉప్పల్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి.. కొద్దిసేపటికి క్రితమే రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపారు. మరోవైపు ఉప్పల్ నియోజకవర్గ బీబ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీషా రెడ్డి, ఆమె భర్త సైతం కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఉప్పల్ టికెట్ ను పరమేశ్వర్ రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. దాంతో టికెట్ ఆయనకు దక్కడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు పార్టీకి రాజీనామా చేశామన్నారు.
వీరితో పాటు ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన మల్ రెడ్డి రంగారెడ్డికి ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కలేదు. అయితే ఇవాళ ఉదయం ఇబ్రహీంపట్నం పరిధిలో ప్రచారం చేస్తున్న మల్ రెడ్డి.. టికెట్ రాలేదని తెలిసి ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. దీంతో ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీపై సీరియస్ గా ఉన్నారు.