'మళ్లీ ఓ సారి ఆలోచించండి..' తమ్మినేనికి కాంగ్రెస్ నేతల ఫోన్లు
X
కాంగ్రెస్ తో పొత్తు చర్చలు విఫలం కావడంతో సీపీఎం (CPM) ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 14 మందితో తొలి విడుత జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం విడుదల చేశారు. తమ్మినేని సైతం ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరో మూడు స్థానాలకు అభ్యర్ధులను ఆదివారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉందని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం ఇన్ని రోజులు వేచి చూశామని.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఇందులో భాగంగానే ఒంటరిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించామన్నారు. బీజేపీ గెలిచే చోట ఓడించగలిగే అభ్యర్థులకే ఓటెయ్యాలని తమ్మినేని సూచించారు. సీపీఎంకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో తాము మద్దతిస్తామని, అక్కడ తాము పోటీ చేయడం లేదన్నారు. కోదాడ, హుజూర్‌నగర్ సహా మరో స్థానానికి అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. తమను గెలిపిస్తే జర్నలిస్టులకు 300 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు.
14 మందితో తొలి జాబితా విడుదల చేయగానే.. కాంగ్రెస్ నేతలు వరుసగా తమ్మినేనికి ఫోన్లు చేస్తున్నారు. జాబితా విడుదలపై మళ్లీ ఒకసారి ఆలోచించాలంటూ కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. తమ్మినేనికి కాల్ చేసి ఎన్నికల్లో పోటీపై పునరాలోచించుకోవాలని కోరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సీయర్ నేత జానారెడ్డి.. తమ్మినేనితో ఫోన్‌లో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా విడుదలను వాయిదా వేయాలని కోరారు. అయితే అది కుదరని జానారెడ్డికి స్పష్టం చేశారు.